: కోట్లా పిచ్ పై విమర్శల వెల్లువ
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి టెస్టుకు వేదికగా నిలిచిన ఢిల్లీలోని కోట్లా మైదానం పిచ్ నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిచ్ పై పడిన తర్వాత బంతి గమనం అంచనాలకు అందకపోవడం, షాట్ల ఎంపిక కష్టసాధ్యం కావడం, వెరసి, ఆసీస్ తొలి రోజే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. బంతి పడిన తర్వాత ఈ పిచ్ పై దుమ్ము లేస్తుండడం బ్యాట్స్ మెన్ ను కలవరపెడుతోంది. ఓ దశలో బంతి బ్యాట్ కు తగలడమే గగనమైంది.
ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు పిచ్ పై సందేహాలు లేవనెత్తారు. ఇటీవలే కామెంటేటర్ అవతారమెత్తిన హైదరాబాదీ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ 'ఇది మూడ్రోజుల వికెట్ లా కనిపిస్తోందే' అని పెదవి విరిచాడు. మరో కామెంటేటర్ రమీజ్ రాజా మాట్లాడుతూ, మ్యాచ్ ఆరంభానికి ముందు పరిశీలించినపుడు ఇది నాసిరకంగా అనిపించిందన్నాడు. అయితే, మ్యాచ్ జరుగుతున్నపుడు పిచ్ గురించి ఇప్పుడే ఓ అంచనాకు రావడం తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించాడు.
ఇక మరో భారత మాజీ క్రికెటర్ రవి శాస్త్రి పిచ్ నివేదిక వెల్లడిస్తూ ఇది 'మూడ్రోజుల్లో ముగిసే వ్యవహారం'లా ఉందని పేర్కొన్నాడు. కాగా, 2010లోనూ ఓసారి కోట్లా పిచ్ అనూహ్యరీతిలో స్పందించడంతో భారత్, శ్రీలంక వన్డే పోరు అర్థాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ఆ పిచ్ ను ఐసీసీ నిపుణులు సమీక్షించి, నూతన పిచ్ తయారు చేయాలని ఢిల్లీ క్రికెట్ సంఘానికి సూచించారు.