: సీమాంధ్రకు ప్యాకేజీ ఇచ్చినా ఫర్లేదు.. బిల్లు పాస్ చేయండి: వీహెచ్
తెలంగాణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందుతుందనే విశ్వాసాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఒక వేళ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందని పక్షంలో అందుకు బీజేపీ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. లోక్ సభలో బిల్లుకు మద్దతు తెలిపిన ఆ పార్టీ రాజ్యసభ దగ్గరకు వచ్చేసరికి బిల్లుకు సవరణలు, సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని వీహెచ్ విమర్శించారు. సీమాంధ్రకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించినా తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ‘‘మా అన్నలు (సీమాంధ్రులు) వారు. మేం వారి తమ్ములం (తెలంగాణ ప్రజలు). వారు ఏ ప్యాకేజీ తీసుకున్నా మాకెలాంటి అభ్యంతరం లేదు. అన్నదమ్ముల్లా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసి ఉందాం’’ అని వీహెచ్ వ్యాఖ్యానించారు.