: నిజాయతీని చాటుకున్న ఆ ఇద్దరు ఎన్నారైలు
దుబాయ్ లో నివసిస్తున్న బిజూ కృష్ణ కుమార్ పిళ్లై, సోని థామస్ లు తమ నిజాయతీని చాటుకున్నారు. అవును మరి.. వెయ్యి రూపాయలు దొరికితేనే గుట్టుచప్పుడు కాకుండా జేబులో వేసుకునే ఈ రోజుల్లో.. ఆ ఎన్నారైలు తమకు దొరికిన 16 వేల డాలర్లను తిరిగిచ్చేసి శభాష్ అనిపించుకున్నారు. దుబాయ్ లో ఇటీవల అల్ ఖలిదియా వీధిలో పిళ్లై, థామస్ నడిచివెళ్తుండగా వారికి 60 వేల దిర్హామ్ లు (16,335 యూఎస్ డాలర్లు) దొరికాయి. ఆ డబ్బులను వారు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు. పోలీసులు సంబంధిత వ్యక్తికి ఆ నగదును అందజేశారు. దుబాయ్ మీడియా ఆ విషయాన్ని ప్రచురించింది. ఎన్నారైల నిజాయతీని గుర్తించిన దుబాయి ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు ఎన్నారైలను సన్మానించాలని ప్రభుత్వం సంకల్పించింది. దాంతో బిజూకృష్ణ, థామస్ లను దుబాయ్ ప్రభుత్వం అబూ దాబిలో బుధవారం నాడు ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి యూఏఈ డిప్యూటీ ప్రధానితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.