: ఎన్నికలపై 'ఉగ్ర'నేత కన్ను
మరికొన్ని నెలల్లో దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించడం పరిపాటి. సరిగ్గా ఈ 'భారీ' తనంపై ఉగ్రవాదులు కన్నేశారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఎన్నికల సభలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసాలకు పాల్పడితే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందన్నది ఉగ్రవాద సంస్థల ప్లాన్ అని కేంద్రం తెలిపింది. 1999లో విమానం హైజాక్ చేసిన ముష్కరులు దాన్ని ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ తీసుకెళ్ళి.. భారత జైలులో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజహర్ ను రాజమార్గంలో విడిపించుకుని వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడా మసూద్ అజహరే భారత్ లో పేలుళ్ళకు కుట్ర పన్నుతున్నాడన్న విషయం భారత హోం శాఖను కలవరపరుస్తోంది.
ఎన్నికల సభలతో పాటు చిన్న విమానాశ్రయాలపైనా ఆత్మాహుతి దాడులకు పాల్పడాలన్నది అతడి వ్యూహమని నిఘా అధికారులు అంటున్నారు. ఇటీవలే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన ఓ సభలో మసూద్ మాట్లాడుతూ, భారత్ లో పెను విధ్వంసం సృష్టించేందుకు ఫిదాయీలు (ఆత్మాహుతి దళ సభ్యులు) సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. ప్రస్తుతం 313 మంది ఫిదాయీలు రంగంలో ఉన్నారని, తాను పిలుపునిస్తే వారి సంఖ్య 3,000కు పెరుగుతుందని తీవ్ర స్వరంతో చెప్పాడు. ఇదిలా ఉంటే, నరేంద్ర మోడీ గనుక ప్రధాని అయితే, అతడిని తప్పక చంపుతానని మసూద్ ప్రమాణం చేసినట్టు కొన్ని కథనాల సారాంశం.