: అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని కోరుకున్నా: చంద్రబాబు


అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని తాను కృషి చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజీనామా విషయాన్ని గవర్నర్ తనకు తెలిపారని అన్నారు. లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసిన ఘటనకు తానే ప్రత్యక్ష సాక్షినని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీలు నాటకాలాడాయని అన్నారు. రాజకీయ లాభం తప్ప ప్రజాసమస్యలు పరిష్కరించాలనే చిత్త శుద్ధి లేదని ఆయన మండిపడ్డారు.

టీఆర్ఎస్ ను ఇప్పుడు విలీనం చేసుకుని, ఎన్నికల తరువాత వైఎస్సార్సీపీని కలుపుకుని రాజకీయ లబ్దిని ఆశించారని అన్నారు. సీఎం రాజీనామా సందర్భంగా కనీసం పార్టీ అధిష్ఠానాన్ని ఒక్క ప్రశ్న కూడా వేయలేదని అన్నారు. టెన్ జనపథ్ లో రాసిన స్క్రిప్టును రాష్ట్రంలో అమలు చేశారని అన్నారు. అలాగే 371(డి)(ఇ)లను ఏ రకంగా పరిష్కరించారని ఆయన ప్రశ్నించారు.

వారు రాష్ట్రానికి పంపిన బిల్లు డ్రాఫ్ట్ బిల్లు అని చెప్పారని, అదే వాస్తవ బిల్లు అని చెప్పలేదని, అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చామన్న పేరుతో టీఆర్ఎస్ ను కలుపుకుంటారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలోనో లేక ముఖ్యమంత్రి కొత్త పార్టీలోనో చేరేవారేనని అన్నారు. ప్రజల్లో విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని బాబు స్పష్టం చేశారు. గత ఆరు నెలలుగా అందరికీ న్యాయం చేసేందుకు తాను చేయని ప్రయత్నం లేదని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కుట్ర కుతంత్రాలను బట్టబయలు చేసేందుకు అన్ని పార్టీల నేతలను కలిసానని అన్నారు. ఇది మంచి సంప్రదాయం సరికాదని ఢిల్లీలో అన్నిపార్టీల నేతలకు చెప్పానని బాబు తెలిపారు. కాంగ్రెస్ గేమ్ ప్లాన్ లో తాను విజయం సాధించలేకపోయానని అన్నారు. అన్ని పార్టీలను పిలవండి, చర్చించండి, ఎన్నికల ముందు ఈ సమస్య పరిష్కారం కాదు, రెండు రాష్ట్రాల ప్రజలకు భవిష్యత్ పై భరోసా కల్పించాలని ప్రయత్నించానని చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఇది రాష్ట్ర సమస్య కాదు జాతీయ సమస్య అని చాటిచెప్పానని స్పష్టం చేశారు. తన స్వార్థం కోసం తానీ ప్రయత్నాలు చేయలేదని, ఎన్నో నిద్రలేని రాత్రలు గడిపానని, అయినా సరే దేశ సమైక్యతకు భంగం వాటిల్ల కూడదని తాను ప్రయత్నించానని బాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News