: యూకే వర్సిటీ రెక్టార్ గా ఎడ్వర్డ్ స్నోడెన్
ఎడ్వర్డ్ స్నోడెన్.. ఈ పేరు వింటే అగ్రరాజ్యం అగ్గిమీద గుగ్గిలమవుతుంది. తన రహస్యాలను ప్రపంచానికి వెల్లడి చేసిన ఈ వ్యక్తి దొరికితే అమెరికా ఏం చేయనుందో అందరికీ తెలిసిందే. దేశ ద్రోహం కింద మరణశిక్ష వేయడం ఖాయం. ప్రస్తుతం రష్యాలో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న స్నోడెన్ గతంలో అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో సమాచార విశ్లేషకుడిగా విధులు నిర్వర్తించాడు. నైతికత పాళ్ళు కాస్త ఎక్కువే ఉన్న ఈ ఆదర్శవాది అమెరికా కుతంత్రాలను లోకానికి బహిర్గతం చేయడంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అనంతరం, భారత్ సహా పలు దేశాల్లో ఆశ్రయం కోసం అర్థించినా అమెరికాకు జడిసి ఎవరూ దరిచేరనీయలేదు. రష్యా మాత్రం ఆదరించింది.
ఇదిలావుంటే, స్నోడెన్ ను యూకేలోని గ్లాస్గో యూనివర్శిటీ విద్యార్థులు తమ రెక్టార్ గా ఎన్నుకొన్నారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థులు స్నోడెన్ లాయర్ కు తెలుపగా, స్నోడెన్ అందుకు అంగీకరించినట్టు ఆ లాయర్ గ్లాస్గో వర్శిటీ విద్యార్థులకు సమాచారం అందించాడు. స్నోడెన్ లాంటి ధైర్యశాలికి తాము సంఘీభావం తెలుపుతున్నామని ఆ విద్యార్థులు సగర్వంగా చెప్పారు. గతంలో గ్లాస్గో వర్శిటీ రెక్టార్ గా వ్యవహరించిన వారిలో నెల్సన్ మండేలా మాజీ భార్య విన్నీ మండేలా కూడా ఉన్నారు.