: తమిళనాడు ప్రభుత్వ సంచలన నిర్ణయం.. రాజీవ్ హంతకులకు స్వేచ్ఛ
రాజీవ్ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జయలలిత అధ్యక్షతన భేటీ అయిన తమిళనాడు కేబినెట్.. రాజీవ్ హత్య కేసులో దోషులైన శ్రీహరన్ అలియాస్ మురుగున్, ఏజీ పెరరివాలన్ అలియాస్ అరివు, సుతేంద్రరాజా అలియాస్ శాంతన్, నళిని, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్ కు క్షమాభిక్ష పెట్టి వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ రోశయ్యకు సిఫార్సులు పంపనున్నారు. గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం వారిని విడుదల చేయనున్నారు.
మురుగన్, పెరరివాలన్, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు జీవితఖైదుగా మార్పు చేసిన 24 గంటల్లోనే తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. సుప్రీం తీర్పు తర్వాత దోషులను విడుదల చేయాలని తమిళనాడు వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. క్షమాభిక్ష పిటిషన్లను 11ఏళ్ల పాటు తేల్చకుండా జాప్యం చేసినందుకు సుప్రీంకోర్టు ముగ్గురు దోషులకు మరణశిక్షను మాఫీ చేసింది. మిగతా నలుగురూ జీవితఖైదీలుగా ఉన్నారు.