: 'ఐపీఎల్' పై పెదవి విప్పిన జస్టిస్ ముద్గల్
ఐపీఎల్ గత సీజన్లో చోటు చేసుకున్న ఫిక్సింగ్ అంశంపై దర్యాప్తు పూర్తి చేసి నివేదిక రూపొందించిన జస్టిస్ ముద్గల్ పెదవి విప్పారు. ఐపీఎల్ మరీ అంత చెడ్డదేమీ కాదని, బీసీసీఐకి ఓ కామధేనువులాంటిదని అభివర్ణించారు. ఐపీఎల్ అవకతవకలన్నింటికి 'ఆఫ్టర్ మ్యాచ్ పార్టీ'లే కారణమని వివరించారు. మ్యాచ్ లు ముగిసిన తర్వాత జరిగే అలాంటి పార్టీల్లోనే క్రికెటర్లకు అవాంఛనీయ వ్యక్తులు పరిచయమవుతుంటారని ముద్గల్ పేర్కొన్నారు. ఐపీఎల్ ద్వారా యువ క్రికెటర్లలో నాణ్యత పెంపొందడం కంటే వారు సెలబ్రిటీలో భుజాలు రాసుకుంటూ తిరిగే అవకాశాలు మెరుగయ్యాయని అభిప్రాయపడ్డారు. వారు అధిక సంపాదన పొందడం తప్పేమీ కాదని, అయితే, అది సవ్యరీతిలో వచ్చే ఆదాయం అయి ఉండాలని సూచించారు. ఇక జస్టిస్ ముద్గల్ టెస్టు క్రికెట్ పైనా అభిప్రాయాలు పంచుకున్నారు. ఐపీఎల్ తో టెస్టు క్రికెట్ తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు. నేటి తరం క్రికెటర్లు క్రీజులో ఓ సెషన్ కూడా ఓపిగ్గా నిలవలేకున్నారని తెలిపారు.