: సీఎం కిరణ్ పై మంత్రి డొక్కా సంచలన వ్యాఖ్యలు


రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది అని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజే సీఎం పదవికి రాజీనామా చేసుంటే రాజ్యాంగ సంక్షోభం వచ్చేదని, విభజన ప్రక్రియ ఆగిపోయి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ముసాయిదా బిల్లును గట్టెక్కించేందుకే కిరణ్ ఇప్పటివరకు పదవిలో ఉన్నారన్నారు. ప్రజల్లో ఉన్న సమైక్య భాగోద్వేగాన్ని కిరణ్ తన రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకున్నారని ఆయన ఆరోపించారు.

2012లో అధిష్ఠానం తెలంగాణకు ప్యాకేజీ ప్రకటించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిర్ణయిస్తే పదవిని కాపాడుకోవడానికి కిరణ్ అడ్డుపడ్డారని ఆయన చెప్పారు. తెలంగాణకు ప్యాకేజీ ఇస్తే.. సీఎం పదవి కూడా ఆ ప్రాంతానికే ఇవ్వాల్సి వస్తుందని అధిష్ఠానం స్పష్టం చేసింది. అందుకే, అప్పుడు 25 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పంపి ప్యాకేజీ వద్దు.. తెలంగాణ రాష్ట్రమే కావాలని హైకమాండ్ కు చెప్పించారని ఆయన వివరించారు. ఎన్నికల ముందు తెలంగాణ ఇవ్వాలని హైకమాండ్ కు సీఎం సూచించారని ఆయన పేర్కొన్నారు.

రెండు ప్రణాళికలతో కిరణ్ ముందుకెళుతున్నారని డొక్కా చెప్పారు. మొదటిది, కొత్త పార్టీ పెట్టి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం.. రెండోది కొత్త పార్టీ పెట్టకుండా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి, ఆ తర్వాత ఏఐసీసీ పదవి చేపట్టడం అని మంత్రి వెల్లడించారు.

  • Loading...

More Telugu News