: ముఖ్యమంత్రి వ్యవహారశైలిని ఖండిస్తున్నా: మంత్రి డీకే అరుణ
తెలంగాణనే మాకు ముఖ్యం కానీ, పదవులు కాదని రాష్ట్ర మంత్రి డీకే అరుణ అన్నారు. ఈ రోజు పార్లమెంటులో టీబిల్లు కచ్చితంగా పాస్ అవుతుందని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ రాజీనామా చేస్తారనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయని... దీనిపై ఆలోచించాల్సిన అవసరం లేదని తెలిపారు. సొంత ముఖ్యమంత్రినే హైకమాండ్ ఒప్పించలేక పోయిందన్న వార్తలపై స్పందిస్తూ... కాంగ్రెస్ అధిష్ఠానం మొదట్నుంచి విభజనకు అనుకూలమనే చెబుతోందని... అయితే, రాష్ట్ర విభజన జరగదన్న అపోహలో సీఎంతో పాటు, మిగిలిన సీమాంధ్ర నేతలందరూ ఉన్నారని, బీజేపీ అడ్డుపుల్ల వేస్తుందని అనుకున్నారని అభిప్రాయపడ్డారు. క్లిష్టమైన సమయంలో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కిరణ్, ఇటువంటి సమయంలో సంయమనంతో వ్యవహరించాల్సి ఉందని... కానీ ఆయన వ్యవహారశైలి విరుద్ధంగా ఉందని, ఆయన శైలిని ఖండిస్తున్నానని చెప్పారు.