: కొత్త పార్టీలకు, రాజీనామాలకు సమయం ఇదా?: బొత్స
సీఎం కిరణ్ పై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ సాయంత్రం హైదరాబాదులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన 'కాంగ్రెస్ బచావో' భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బేరీజు వేసుకుని వ్యవహరించాలని సూచించారు. కొత్త పార్టీలు, రాజీనామాలకు ఇది సమయం కాదని హితవు పలికారు. సీఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నట్టు వస్తున్న ఊహాగానాలపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సత్తిబాబు పైవిధంగా జవాబిచ్చారు. వారు ముందే మూకుమ్మడి రాజీనామాలు చేస్తే బాగుండేదని సలహా ఇచ్చారు. సమయం మించిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరగకుండా చివరి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు, జగన్, కిరణ్, రాఘవులకు లేఖ రాసినట్టు తెలిపారు. రేపు ఢిల్లీకి అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.