: సివిల్స్ లో ఆంగ్లభాష తప్పనిసరి కాదు: కేంద్ర ప్రభుత్వం
సివిల్స్ పరీక్షలో ఆంగ్ల భాష తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం ప్రత్యామ్నాయంగానే ఎంచుకోవచ్చని చెప్పింది. ఆసక్తిగల అభ్యర్ధులు ప్రాంతీయ భాషలోనే పరీక్ష రాయవచ్చని పేర్కొంది. 'రాజ్యాంగంలోని షెడ్యూల్ 8 కింద అభ్యర్ధి ప్రాంతీయ భాషను మాధ్యమంగా ఎంచుకునేందుకు అనుమతించబడుతుందని లేదా ఆంగ్ల మాధ్యమంలోనైనా పరీక్ష రాయవచ్చని' ఈరోజు లోక్ సభలో పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ మంత్రి వి.నారాయణ స్వామి ప్రకటించారు.
అభ్యర్ధులకు ఇంగ్లిషును తప్పనిసరి చేస్తూ మార్చి 5న విడుదలైన 'సివిల్స్-2013 నోటిఫికేషన్'లో స్పష్టం చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే, ఈ అంశంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత రావడం, కొన్నిరోజుల కిందట లోక్ సభ దద్ధరిల్లడంతో దీనిని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి 250 మార్కుల వ్యాసరూప పరీక్షపత్రంలో అభ్యర్ధులు తమకు నచ్చిన భాషలో రాయవచ్చని తెలియజేశారు.