: తెలంగాణ బిల్లుకు తొలి ఓటు వేస్తా: నామా
లోక్ సభలో తెలంగాణ బిల్లుకు ఓటింగు పెడితే తొలి ఓటు తానే వేస్తానని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అయితే, ఉద్యమం ముసుగులో ఎన్టీఆర్ విగ్రహాలపై టీఆర్ఎస్ దాడులు చేయడం మానుకోవాలన్నారు. సభ్యత, సంస్కారం ఉన్నందువల్లే తాము ఆగుతున్నామన్నారు. లేకుంటే వారికంటే ఎక్కువగానే దాడులు చేయగలమని మండిపడ్డారు.
కాగా, ఎంపీ లగడపాటి రాజగోపాల్ లోక్ సభలో పెప్పర్ స్ప్రే ఉపయోగించిన తరువాతే అతనిపై ఇతర రాష్ట్రాల ఎంపీలు దాడి చేశారని నామా అన్నారు. అయితే, సభలో ఎవరు ఎవరి మీద దాడి చేయలేదని, విభజన బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో అడ్డుకోవడంతోనే సీమాంధ్ర ఎంపీలను వారించామని చెప్పారు. గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ కొనకళ్ల నారాయణను సీమాంధ్ర ఎంపీలు ఎవరూ పట్టించుకోలేదని, తాను, ఎంపీ రమేష్ రాథోడ్ కలిసి ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఎంపీ మోదుగుల చేతిలో ఉన్నది మైకు ముక్కేనని తెలిపారు. అయితే, టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత ఎవరనేది పార్టీ అధిష్ఠానం తేలుస్తుందన్నారు. పార్లమెంటులో గందరగోళానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.