: లక్ష్మణరేఖ దాటిన ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయాలి: ఎంపీ పొన్నం
పార్లమెంటులో ఎంపీలపై దాడి చేసిన సభ్యులకు జీవిత కాల నిషేధం విధించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ధిక్కరించిన సీఎం కిరణ్ ను సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం గీసిన లక్ష్మణరేఖను ఆయన ఎప్పుడో దాటారని, అందుకే ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. అయితే, ఎవరెన్ని ఎత్తులు వేసినా.. పార్లమెంటులో తెలంగాణ బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందని పొన్నం ప్రభాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారని, బిల్లు పాసవుతుందనే నమ్మకముందని అన్నారు.
ముసాయిదా బిల్లుపై బీజేపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారని పొన్నం చెప్పారు. కానీ, ప్రజలు బీజేపీ నేతలు చెప్పిన దాంట్లో ఎవరి మాటలను పరిగణనలోకి తీసుకోవాలో చెప్పాలని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీ అగ్ర నేత అద్వానీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కూడా తెలంగాణకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని ప్రకటించారని ఆయన చెప్పుకొచ్చారు.