: ఓ పార్టీ చేతిలో పావుగా లోక్ సభ స్పీకర్: సబ్బం హరి
లోక్ సభ స్పీకర్ ఓ పార్టీ చేతిలో పావుగా మారారని అనిపిస్తోందని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి ఆరోపించారు. సభలో తమతో పాటు తెలంగాణ కాంగ్రెస్, అన్నా డీఎంకే, బీఎస్పీ ఎంపీలు ఉన్నారన్న ఆయన, తమపై మాత్రమే చర్యలు తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల ఎంపీలను తమపై (సీమాంధ్ర ఎంపీలు) మార్షల్స్ గా ఉపయోగించారని, పార్లమెంటులో కాంగ్రెస్ గూండాగిరి చేస్తోందని విమర్శించారు. అయితే, తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదన్నారు. ఢిల్లీలో మీడియాతో సబ్బం మాట్లాడుతూ, ముగ్గురు ఎంపీలు కొడుతుంటేనే లగడపాటి పెప్పర్ స్ప్రే ఉపయోగించారన్నారు. కమల్ నాథ్ సభను ఇల్లు అనుకుంటున్నారా? అని మండిపడ్డారు. ఏపీ ఎంపీలు లేకుండా విభజన బిల్లుపై ఎలా చర్చిస్తారు? అని ప్రశ్నించిన ఎంపీ, పార్లమెంటు టెన్ జనపథ్ కాదన్నారు. ఏపీ విభజన సొంత వ్యవహారం కాదని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని చెప్పారు. తమ ప్రాంత ప్రయోజనాల కోసమే త్రికరణశుద్ధిగా పని చేస్తున్నామని సబ్బం పేర్కొన్నారు.