: తెలంగాణకు బీజేపీ కట్టుబడి ఉంది: రాజ్ నాథ్ సింగ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భారతీయ జనతాపార్టీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఆ విషయంలో బీజేపీ విశ్వసనీయతను శంకించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముసాయిదా బిల్లుకు మద్దతిచ్చే విషయం గురించి పదే పదే చెప్పాల్సిన పనిలేదని ఆయన అన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లును ఆమోదించేటప్పుడు .. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లోనే బిల్లు తీసుకువస్తే మద్దతు ఇస్తామన్న విషయాన్ని మొదట్నుంచీ చెబుతున్నామని ఆయన గుర్తుచేశారు. అయితే, బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీనే ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రాంతాల వారీగా భిన్నంగా వ్యవహరిస్తున్నారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.