: బిల్లు పెడితే రాజీనామా చేస్తానన్న సీఎం ఇంకా మౌనంగా ఎందుకున్నారు?: దామోదర
ముఖ్యమంత్రి కిరణ్ పై డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మరోసారి విరుచుకుపడ్డారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టగానే రాజీనామా చేస్తానన్న సీఎం... ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఫైళ్లను క్లియర్ చేయడం మినహా ఆయన మరేమీ చేయలేరని విమర్శించారు. సీఎంకు ఏమాత్రం నీతి, నిజాయతీ ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంతం కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రికి సమైక్యాంధ్ర గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఈరోజు సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో ప్రవర్తించిన తీరు దేశ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న భూములపైనే సీమాంధ్ర నేతల దృష్టంతా ఉందని ఆరోపించారు.