: రూ 53 వేల స్కూటర్ కి రూ 7 లక్షలతో ఫాన్సీ నంబర్..!
పంజాబ్ లో ఉగ్రవాదం సమసిపోయి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ అక్కడి వారికి 'ఏకే-47' మీద మక్కువ తొలగినట్టు లేదు. అప్పట్లో పంజాబ్ మిలిటెంట్ల చేతిలో ఎక్కువగా ఇవే ఆయుధాలు దర్శనమిచ్చేవి. అయితే, తాజాగా 'ఎకే-47' మరోసారి వార్తల్లోకెక్కింది. ఎలాగంటే, కుల్బీర్ సింగ్ అనే పంజాబ్ రైతు తన హోండా ఆక్టివా స్కూటర్ కోసం పీబీ-07 ఏకే-47 అనే నెంబర్ తీసుకున్నాడట.. రూ. 7 లక్షలు ఖర్చుపెట్టి మరీ.
అదీ విషయం. ఇంతకీ ఆ స్కూటర్ విలువ అన్ని పన్నులూ కలుపుకుని రూ. 53,000. వేలం అనంతరం కుల్బీర్ మాట్లాడుతూ, ఈ నెంబర్ ను తప్పకుండా చేజిక్కించుకోవాలని విదేశాల్లో ఉన్న తమ బంధువులు ప్రోత్సహించారని చెప్పాడు. ఈ నెంబర్ కోసం రూ. 12-13 లక్షలైనా ఖర్చు పెట్టేవాణ్ణని కుల్బీర్ అంటున్నాడు. ఇక ఈ రైతు తనకిష్టమైన నెంబర్ ను వేలంలో దక్కించుకోగానే అతని కుటుంబ సభ్యులు చుట్టుపక్కలవారికి స్వీట్లు పంచిపెట్టారట.