: అవును..! ఆ అమ్మాయి తెగ తాగేస్తోంది!
అవును.. మీరు చదివింది నిజమే..! ఆ అమ్మాయి ఇప్పటివరకూ ఏమీ తినలేదు. కానీ తెగ తాగేస్తోంది. అలా అని తాగుబోతు అని తప్పుగా అర్థం చేసుకునేరు.. కానే కాదు, ఆమె తాగేది - పాలు, నీళ్లు, తేనీరు, పళ్లరసాలు అంతే. కానీ, హర్యానాలో హాయిగా జీవితాన్ని గడుపుతోంది. అంతే కాదు, ఇంట్లోని పనులన్నిటినీ ఆమె స్వయంగా చేసుకుంటోంది. ఇలా ఒకటి, రెండూ కాదు.. ఏకంగా 25 ఏళ్లుగా ఘన పదార్థాలేమీ ముట్టకుండా ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ఆ అమ్మాయి పేరు ముంజు దారా. ఆహారం చూడగానే మంజు ముఖం చిట్లిస్తోంది. ఎందుకంటే ఆమె అక లాజియా అనే సమస్యతో బాధపడుతోంది. దీని వల్ల ఆమె ఏదైనా తినాలనుకున్నా.. వెంటనే వాంతి అయిపోతుంది. పైగా.. తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. మనం ఏదైనా ఆహారాన్ని తిన్నప్పుడు అన్నవాహిక దాన్ని కడుపులోకి తీసుకెళ్తుంది. కానీ మంజు అన్నవాహికకు అంత సామర్థ్యం లేదు. అన్నవాహిక చివరి భాగం పూర్తిగా తెరుచుకుని లేదు. శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయించుకునే అవకాశమున్నా.. ఆమె తల్లిదండ్రులు పేదవారు కావడంతో చికిత్స చేయించే పరిస్థితిలో లేదు. దీంతో, వారి వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో మంజు తాగే పాల కోసం ఓ ఆవును కొన్నారు. ఆమె రోజూ నాలుగైదు లీటర్ల పాలు తాగుతుంది. అప్పుడప్పుడు టీ, జ్యూస్ వంటివి తీసుకుంటుంది. ఇన్నేళ్లుగా, ఘన పదార్థాలు ముట్టకుండా.. కేవలం ద్రవపదార్థాలే తీసుకున్నా మంజు ఆరోగ్యంగానే ఉండటం విశేషం.