: నేడు సీమాంధ్ర బంద్
లోక్ సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఈ రోజు సీమాంధ్ర బంద్ కు సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. విభజనకు వ్యతిరేకంగా చేస్తున్న ఆఖరిపోరాటానికి మద్దతివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తాము ఈ రోజు తలపెట్టిన బంద్ కు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని సమితి చైర్మన్ అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్జీవోల బంద్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ సీమాంధ్ర నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలిపారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి ఎలా ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ రోజు జరగనున్న సమైక్య బంద్ లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని .. అందుకే అందరూ కలసి ఢిల్లీ వారి విభజన వాదంపై దండెత్తాలని ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.