: రామప్ప దేవాలయానికి మేడారం భక్తుల తాకిడి
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకుని వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో వరంగల్ జిల్లాలోని రామప్ప గుడిని సందర్శించడంతో వేయి స్తంభాల దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రామప్పగుడికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ డబ్ల్యూఎస్, దేవాదాయ, విద్యుత్ శాఖాధికారులు మంగళవారం నుంచే రామప్పగుడిలో ఉంటూ భక్తులకు సేవలందిస్తున్నారు. రామప్పగుడిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి చెక్ పోస్టుల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రామప్ప ఆలయ గార్డెన్ లో అత్యవసర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనారోగ్యానికి గురైన 296 మందికి ఉచిత వైద్య సేవలు అందించినట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ వైద్యశిబిరంలో సీహెచ్ఓ స్వామి, వైద్య పర్యవేక్షణాధికారి కిరణ్ కుమార్, ఏఎన్ఎంలు స్వర్ణలత, సరిత, అనూరాధ, శోభారాణి, అనిత తదితరులు పాల్గొన్నారు. అలాగే తహశీల్దార్ మంజుల ఆద్వర్యంలో రామప్పలో రెవెన్యూ శాఖ తరఫున సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేయి స్తంభాల గుడిని సందర్శించే భక్తులకు సహాయ కేంద్రం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలను అందించనున్నట్లు తహశీల్దార్ చెప్పారు.