: ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటన జరగలేదు: ప్రకాశ్ జవదేకర్
పార్లమెంటులో జరుగుతున్న అంశాలపై బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఇంత వరకూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రులు లోక్ సభను అడ్డుకోవడం అంటే.. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకావడం లేదనే అర్ధమని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ బిల్లు ఆర్ధిక బిల్లు అవునో, కాదో కూడా తేల్చుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఇవ్వాల్సిందేనని, అలాగే సీమాంధ్రకు న్యాయం చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుకు తాము మద్దతిస్తామని, అయితే సీమాంధ్రకు న్యాయం చేయండని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ నేతలను అదుపు చేసుకోలేని దుస్థితికి దిగజారిపోయిందని, సాక్షాత్తూ అధినేత్రి ముందే ఆ పార్టీ నేతలు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.