: శాసనసభ సీనే పునరావృతమౌతుందా?


తెలంగాణ బిల్లుపై శాసనసభలో ఎదురైన గందరగోళ పరిస్థితే పార్లమెంటులోనూ పునరావృతమవుతుందా? అనే చర్చ జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. సస్పెన్స్ తెలుగు సినిమాను తలపిస్తున్న తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ కావడంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లు ఆమోదానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభే ఆదర్శం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ శాసన సభ్యులు బిల్లును పాస్ చేయించేందుకు ప్రయత్నించగా, సీమాంధ్ర నేతలు గందరగోళం మధ్య వ్యూహాత్మకంగా మూజువాణి ఓటుతో బిల్లును తిరస్కరించి కేంద్రానికి పంపించారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇదే సూత్రాన్ని అమలు చేయనుందని కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు చెబుతున్నట్టు వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. పార్లమెంటులో గందరగోళం మధ్య బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే ప్రణాళికలు కాంగ్రెస్ పార్టీ ముందు సిద్ధంగా ఉన్నాయి. అందుకే అవసరమున్నా లేకున్నా తెలంగాణ నేతలు వెల్ లోకి దూసుకెళ్లడం, నినాదాలు చేయడం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నీ వ్యూహాత్మకంగానే చేస్తోందని తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇన్నాళ్లూ వేచి చూసిన కాంగ్రెస్ సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను ఇప్పుడే సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని.. వారు గత పార్లమెంటు సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానం ఇచ్చారని.. సస్పెండ్ చేయాలనుకుంటే అప్పుడే చేసి ఉండేవారని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రణాళిక ప్రకారం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తుందని, ఆ విషయం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసని పలువురు తెలంగాణ నేతలు చెబుతున్నారు.

సస్పెన్షన్ పెద్ద విషయం కాదని, ఇంత జరిగితే తెలంగాణ నేతలు అంతా ఒక్కటై అధిష్ఠానానికి ఝలక్ ఇచ్చేవారని, సీమాంధ్ర నేతలు తలోదారి కనుక అంత ధైర్యం చేయరని ఒక సీమాంధ్ర నేత వ్యాఖ్యానించారు. బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదింపజేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సీన్ పార్లమెంటులో కనువిందు చేయనుందన్నమాట!

  • Loading...

More Telugu News