: ఆ విషయంలో పాకిస్తాన్ కంటే మనమే బెటర్!
క్రీడలైనా కానివ్వండి.. అది సరిహద్దుల వద్ద యుద్ధమైనా అవనివ్వండి.. పొరుగుదేశం పాకిస్తాన్ పై మనదే పైచేయిగా ఉండాలని ప్రతి ఒక్క భారతీయుడూ ఆకాంక్షిస్తాడు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ విషయంలో సగటు భారతీయుల దేశభక్తిని ఎవరూ శంకించలేరు కూడా. భారత్ కూడా క్రీడల్లోనే కాకుండా, రాజకీయపరమైన అంశాల్లో అన్నింటిలోనూ పాక్ పై తన పైచేయిని చాటుకుంటూ వస్తోంది.
తాజాగా, పర్యాటకులను ఆకర్షించడంలోనూ భారత్.. దాయాది పాకిస్తాన్ కంటే ముందు వరుసలో ఉందట. ద ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్ నెస్ సూచికలో భారత్ కు 65వ స్థానం దక్కింది. ఆయా దేశాల పర్యాటక వ్యవస్థ, భద్రత, మౌలిక సదుపాయాలు, వసతులు, రవాణా సౌకర్యాలు, వైద్య ఆరోగ్య సేవలు, పర్యావరణం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.
ఈ జాబితాలో పాకిస్తాన్ ఎక్కడో 122వ స్థానంతో సరిపెట్టుకుంది. ఉగ్రవాదులకు నిలయం కావడమే అందుకు కారణమని తెలుస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొత్తం 140 దేశాలతో ఈ జాబితాను ప్రకటించింది. కాగా, గతంలో కంటే భారత్ ఈసారి మూడు స్థానాలు మెరుగుపర్చుకోవడం విశేషం. 2011లో భారత్ కు 68వ స్థానం లభించింది. పొరుగుదేశాలైన శ్రీలంక 74, నేపాల్ 112, బంగ్లాదేశ్ 123వ స్థానంలో ఉన్నాయి. ఇక ఆసియా పసిఫిక్ స్థాయిలో భారత్ కు 11వ స్థానం దక్కింది.