: ప్రాణాలు కాపాడిందని సెల్ ఫోన్ కు పూజలు


భక్తులను అపాయం నుంచి తప్పించేందుకు భగవంతుడు వివిధ అవతారాల్లో వస్తాడని మనం పురాణాలు, ఇతిహాసాల్లో చదువుకున్నాం. అందుకే, దేవుడిని గుడికట్టి మరీ పూజిస్తాం. బీహార్ లో ఓ వ్యక్తి మాత్రం సెల్ ఫోన్ కు పూజలు చేస్తున్నాడు. వివరాల్లోకెళితే.. బీహార్లో ఆదివాసీ ప్రాంతమైన బాలాఘాట్ జిల్లా బాయిహార్ గ్రామంలో రంగ్దాలే అనే వ్యక్తి ఓ రోజు ఎద్దు కనిపించడంలేదని వెతుకుతూ పొలం బాట పట్టాడు. తోడుగా మిత్రుడు రాధేలాల్ కూడా ఉన్నాడు.

అటవీప్రాంతం కావడంతో క్రూరమృగాల సంచారం ఎక్కువే. వీరిద్దరూ అలా వెతుకుతూ ముందుకు సాగుతుండగా.. ఓ పొద వద్ద అలికిడి అయింది. ఇంతలోనే గాండ్రిస్తూ ఓ ఆడపులి తన రెండు పిల్లలతో బయటికొచ్చింది. అది చూసి ప్రాణాలు కాపాడుకునేందుకు మిత్రులిద్దరూ సమీపంలోని రావి చెట్టు ఎక్కారు. కానీ, ఆ పులి చెట్టు కిందనే మకాం వేయడంతో వారిద్దరూ చెట్టు దిగే సాహసం చేయలేకపోయారు. రెండుమూడుసార్లు ఆ పులి చెట్టెక్కే ప్రయత్నం చేసినా, తన పిల్లలు కూడా అనుసరిస్తుండడంతో విరమించుకుంది. మూడు గంటలకు పైగా ఆ చెట్టుపైనే కూర్చున్న రంగ్దాలేకు అమోఘమైన ఐడియా వచ్చింది..

వెంటనే జేబులో ఉన్న మొబైల్ ఫోన్ తీసి బంధుమిత్రులకు సమాచారం అందించాడు. దీంతో, వారు గ్రామస్తులనందరినీ పోగు చేశారు. అందరూ కలిసి కర్రలు, కట్టెలు, బరిసెలు చేతబట్టి బిగ్గరగా అరుచుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ వచ్చారు. దీంతో, ఆ పులి కాస్తా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బతుకుజీవుడా.. అంటూ చెట్టు దిగొచ్చిన రంగ్దాలే, రాధేలాల్ లు ఊపిరి పీల్చుకున్నారు. సీన్ కట్ చేస్తే.. ప్రాణాలు కాపాడిన ఆ మొబైల్ ఫోన్ ప్రస్తుతం రంగ్దాలే ఇంట్లో దేవుడి పటాల మధ్యన కొలువై పూజలు పునస్కారాలు అందుకుంటోంది. ఆ ఫోన్ తనపాలిట దైవమని, ఎవరడిగినా దాన్నివ్వబోనని చెబుతున్నాడు రంగ్దాలే.

  • Loading...

More Telugu News