: లాటరీ సొమ్ము కోసం బీబీసీ మెట్లెక్కిన పల్లెటూరి ఆసామి


అతని పేరు రతన్ కుమార్ మాల్బిసోయ్. ఒడిశాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి ఎప్పుడో తన సెల్ ఫోన్ కు వచ్చిన మెసేజి ఆధారంగా ఢిల్లీలోని బీబీసీ కార్యాలయానికి వెళ్ళాడు. బీబీసీ లాటరీ వచ్చినట్టు తన ఫోన్ కు ఎస్సెమ్మెస్ వచ్చిందని, తనకు రూ. 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందేనని భీష్మించుక్కూచున్నాడు. 2012లో రతన్ కుమార్ ఫోన్ కు మెసేజి రాగా, సదరు నంబర్ కు ఫోన్ చేశాడు. తనను బీబీసీ చాన్సలర్ గా పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి తొలుత తమ అకౌంట్లో రూ.12 వేలు డిపాజిట్ చేస్తే, లాటరీ సొమ్మును రిజర్వ్ బ్యాంకు అకౌంట్ లో వేస్తామని చెప్పాడు. అప్పటి నుంచి ఈ ఒడిశా వ్యక్తి వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడు.

ఇక ఈ విషయం అటోఇటో తేల్చుకోవాలనుకుని గ్రామస్తుల వద్ద అప్పుచేసి ఢిల్లీ రైలెక్కాడు. రాత్రి ప్లాట్ ఫామ్ పై పడుకుని ఉదయాన్నే వెళ్ళి.. 'లాటరీ సొమ్ము ఇవ్వండి బాబూ, మా ఊరెళతాను' అని బీబీసీ వారిని ప్రాధేయపడడం మొదలెట్టాడు. ఆ వెర్రిబాగుల వ్యక్తికి విషయం వివరించి చెప్పేసరికి బీబీసీ సిబ్బందికి తలప్రాణం తోకకు వచ్చినంత పనయ్యింది. 'తమ బీబీసీ పేరుపై నేరగాళ్ళు చేస్తున్న మోసం ఇది బాబూ' అంటూ అతగాడికి జ్ఞానబల్బు వెలిగించడంలో బీబీసీ వారు సక్సెసయ్యారు. సీన్ కట్ చేస్తే.. మనోడు ఉత్తచేతులతో ఊరికి తిరిగి రావాల్సి వచ్చింది. లాటరీ సొమ్ము దక్కకపోగా, చార్జీల కోసం చేసిన అప్పులే మిగిలాయి. ఇలా బీబీసీ పేరిట, కోలా డ్రింక్స్ పేరిట పలువురికి దొంగ లాటరీ మెసేజులు వస్తున్న సంగతి తెలిసిందే!

  • Loading...

More Telugu News