: ఇకపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తాం: సబ్బం హరి
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు, ఇప్పటిదాకా ప్రజాస్వామికంగా వ్యవహరించామని... ఇకపై వ్యూహం మార్చి, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తామని అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి హెచ్చరించారు. రాష్ట్రాన్ని చీల్చడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉందని అన్నారు. విభజన బిల్లును పాస్ చేయడం కోసం కాంగ్రెస్, బీజేపీలు ఏకమైనట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. 70 మంది ఎంపీలు సమర్థిస్తున్న అవిశ్వాస తీర్మానాన్ని మంగళవారం నాడు లోక్ సభ స్పీకర్ కు అందజేయనున్నట్టు తెలిపారు. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్న వారు... ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విభజనను అడ్డుకోవడానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. పేరుకు మాత్రమే హైకమాండ్ ఉందని... కానీ, అంతా సోనియాగాంధీ నిర్ణయాల మేరకే జరుగుతోందని విమర్శించారు.