: కరుణ మైండ్ గేమ్.. నేడు మంత్రుల రాజీనామా
తలపండిన రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మరోసారి యూపీఏ సర్కారుకు తన తడాఖా ఏంటో చూపించారు. శ్రీలంకలో ఎల్ టీటీఈని తుదముట్టించే క్రమంలో వేలాది మంది తమిళులను శ్రీలంక సైన్యం ఊచకోత కోసిన దారుణాన్ని ఖండిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయాలని, ఇదే అంశంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేయాలని డిమాండ్ చేస్తూ వచ్చిన కరుణ నిన్న అకస్మాత్తుగా తన వైఖరిని కఠినతరం చేశారు. యూపీఏ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
దీనిని యూపీఏ నేతలు తేలిగ్గా తీసుకున్నారు. చిదంబరం లాంటి నేతలు కూడా ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ప్రకటించారు. దీంతో కరుణ యూపీఏకు మరో షాక్ ఇచ్చారు.యూపీఏ సర్కారుకు మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ఏకంగా ఆ పార్టీ నేతలు రాష్ర్టపతిని కలిసి లేఖ ఇచ్చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు కంగు తిన్నారు. అంతేకాదు కేంద్ర మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన ఐదుగురు మంత్రులు నేడు ప్రధానికి రాజీనామా లేఖలను సమర్పించనున్నారు.
ఇందులో యూపీఏ సర్కారుపై ఒత్తిడి తీవ్రతరం చేసే వ్యూహమే కనిపిస్తోంది. ఇందుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత బాలు ప్రకటనే నిదర్శనం. శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయాలని, స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్ చేయాలని, ఐ.రా.సలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేయాలని, అప్పుడే మద్దతుపై పునరాలోచన చేస్తామని రాష్ర్టపతిని కలిసిన అనంతరం బాలు చెప్పారు.
అయితే, డీఎంకే డిమాండ్లపై కమల్ నాథ్ చర్చలు కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి చిదంబరం ఈ ఉదయం ఢిల్లీలో చెప్పారు. పార్లమెంటులో తీర్మానం ద్వారా శ్రీలంకకు గట్టి సందేశం పంపుతామని తెలిపారు. మొత్తానికి కరుణ వ్యూహం దేశ రాజకీయాలలో మరోసారి సంచలనాత్మకంగా మారితే యూపీఏకు చెమటలు పట్టించింది.