: ‘ఆ’ మంత్రిని అరెస్ట్ చేయాల్సిందే: డాక్టర్లు
మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన జమ్మూ-కాశ్మీర్ వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్ ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ అక్కడి డాక్టర్లు నిరసన ప్రదర్శన చేశారు. శ్రీనగర్ లోని అన్ని ఆసుపత్రులలోనూ తమ రోజువారీ విధులకు వారు గైర్హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖామంత్రి అయిన ఖాన్, సదరు లేడీ డాక్టర్ ను తన కార్యాలయానికి పిలిపించుకుని, ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనను అరెస్ట్ చేయాలంటూ వైద్యులు తమ తమ ఆసుపత్రుల వద్దే నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాన్ శుక్రవారం నాడు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో దోషిని కఠినంగా శిక్షించేవరకు తమ నిరసనలు కొనసాగుతాయని కాశ్మీర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు నిస్సారుల్ హసన్ తెలిపారు. ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు, క్యాజువాలిటీ సర్వీసులను మాత్రమే కొనసాగిస్తున్నామని, ఆదివారంలోగా ఖాన్ ను అరెస్ట్ చేయకపోతే అత్యవసర సర్వీసులు సహా అన్ని రకాల విధులను నిలిపివేస్తామని హసన్ హెచ్చరించారు.