: పోలీస్ వ్యాన్ నే పేల్చివేయాలనుకున్న కర్కోటకుడు
పాకిస్తాన్ తో వైరం ప్రబలినప్పటి నుంచి ఉగ్రవాదులకు భారత్ హాట్ టార్గెట్ గా మారింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి తీవ్రవాద సంస్థల ప్రాబల్యం తగ్గుతున్న సమయంలో పురుడుపోసుకున్న ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదిన్. కర్ణాటకకు చెందిన యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్ సోదరులు స్థాపించిన ఈ సంస్థ భారతదేశ నగరాల్లో ముఖ్యంగా హైదరాబాదులో పేలుళ్ళకు పాల్పడి అమాయకులను పొట్టనబెట్టుకుంది. ఇటీవలే పోలీసులకు పట్టుబడిన యాసిన్ భత్కల్ పై విచారణ జరుపుతున్న సందర్భంగా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
2011, జులై 13న ముంబయిలో పలు పేలుళ్ళకు పాల్పడిన యాసిన్.. దాదర్ ప్రాంతంలో ఓ పోలీస్ వ్యాన్ నూ పేల్చివేయాలనుకున్నాడట. అయితే, అతను ఆ ప్రాంతానికి వచ్చేసరికి వ్యాన్ ముందుకు కదలడంతో దారుణం తప్పింది. వ్యాన్ ఎప్పుడూ నిలిపి ఉంచే ప్రదేశం వద్ద ఓ చెత్తకుండీలో బాంబును పెట్టినా.. వ్యాన్ వెళ్ళిపోవడంతో యాసిన్ ప్లాన్ తలకిందులైంది. అప్పట్లో మూడు ప్రదేశాల్లో బాంబులు పేల్చిన యాసిన్ 21 మందిని బలిగొన్నాడు. నాలుగో బాంబుతో పోలీసులను చంపాలనుకుని విఫలమయ్యాడని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.