: పిల్లల్లో ఊబకాయం తెచ్చే పాలు!
కొవ్వు పదార్ధాలు తింటేనే ఊబకాయం వస్తుందనుకుంటాం. అందుకే, ఇటీవలి కాలంలో తల్లులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే కొవ్వు తీసిన పాలను (టోన్డ్ మిల్క్) పడుతున్నారు. అయితే, దీని వల్ల ప్రయోజనం లేదనీ, పైపెచ్చు ఇలా వెన్న తీసిన పాలను తాగుతున్న పిల్లలే ఊబకాయం బారిన పడుతున్నారనీ తాజాగా బ్రిటన్ లో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
కొవ్వుతో కూడిన పాలను (ఓల్ మిల్క్) తీసుకుంటున్న పిల్లలతో పోల్చితే, వెన్న తీసిన పాలను తీసుకుంటున్న పిల్లలలోనే అధిక బరువు కనపడుతోందని రుజువైంది. పూర్తి కొవ్వు వుండే పాలను తీసుకునే పిల్లలలో ఆకలి సంతృప్తి చెందుతుందనీ, దాంతో వారిక చిరుతిళ్ళ వైపు మళ్ళరనీ, ఫలితంగా ఊబకాయం వారి దరి చేరదనీ బ్రిటన్ అధ్యయనం తెలిపింది. వెన్న తీసిన పాలను తాగే పిల్లలలో ఆకలి అధికంగా ఉండడంతో వారు చిరుతిళ్ళు ఎక్కువ తింటారనీ తద్వారా ఊబకాయానికి గురవుతున్నారనీ అంటున్నారు. కాబట్టి, తల్లులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.