: విమానంలో ప్రయాణికులను వణికించిన హైజాకర్!
పీగాసస్ ఎయిర్ లైన్స్ విమానం. 110 మంది ప్రయాణికులతో శుక్రవారం ఉక్రెయిన్ నుంచి టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయానికి వెళుతోంది. గమ్యస్థానానికి చేరువలో ఉంది. ఇంతలో ప్రయాణికుల్లోంచి ఒక ఆగంతుకుడు లేచాడు. విమానంలో బాంబు పేలడానికి సిద్ధంగా ఉందన్నాడు. ఆ మాటలతో లోపలున్న వారందరూ వణికిపోయారు. 'లగేజీలో బాంబు పెట్టి ఉంది. విమానాన్ని ఇస్తాంబుల్ లో దింపడానికి వీల్లేదు. నేరుగా రష్యాలోని సోచి పట్టణానికి తీసుకెళ్లండి' అని ఆదేశించాడు. సోచిలో శీతాకాల ఒలింపిక్ క్రీడలు శుక్రవారమే ప్రారంభమయ్యాయి.
పైలట్ ఆలస్యం చేయలేదు. విషయాన్ని గ్రౌండ్ కంట్రోలింగ్ అధికారులకు చేరవేశాడు. ఎఫ్-16 యుద్ధవిమానం బయల్దేరింది. సదరు ప్రయాణికుల విమానాన్ని సమీపించి రక్షణతో దానిని ఇస్తాంబుల్ లోని సబీహా గోకెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపివేసింది. ఉక్రెయిన్ సెక్యూరిటీ విభాగం పోలీసులు బెదిరింపులకు దిగిన ఆగంతుకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు బాగా మద్యం తాగిన స్థితిలో ఉన్నాడని.. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఏమవుతుందో? అన్న ఆందోళన అటు రష్యా, ఇటు ఇతర ప్రపంచ దేశాలనూ కలవరపెట్టింది. సోచి వెళ్లే విమాన ప్రయాణికులే లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించిన మర్నాడే ఇది జరగడం గమనార్హం!