: నేను 'తాలిబన్ ఖాన్' ను కాదు: ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ తనపై పడిన అపవాదును చెరిపేసుకునే పనిలో పడ్డారు. తాను 'తాలిబన్ ఖాన్' ను కాదని చెప్పారు. ఓవైపు తాలిబన్ మిలిటెంట్లు దాడులతో పాకిస్తాన్ ను అతలాకుతలం చేస్తుంటే, ఇమ్రాన్ వారిపై మెతకవైఖరి అనుసరిస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాలిబన్ల దురాగతాలను ఖండించకుండా వారికి అనుకూల వైఖరి అవలంబిస్తున్నారని వాగ్బాణాలు సంధిస్తున్నారు. వీరికి తోడు అమెరికా వర్గాలు ఇమ్రాన్ ను తాలిబన్ ఖాన్ అని అభివర్ణిస్తున్నాయి. వీటన్నటి నేపథ్యంలో ఈ మాజీ క్రికెటర్ కదనరంగంలోకి దిగాలని నిశ్చయించుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఇకపై దీటుగా తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. డాలర్లపై ఆధారపడ్డ దేశం తనపై తాలిబన్ అనుకూల ముద్ర వేయడం వ్యూహాత్మకమని చెప్పారు. టెర్రరిజంపై అమెరికా పోరుకు, పాకిస్తాన్ లో టెర్రరిజానికి ఉన్న లింకు నుంచి అందరి దృష్టి మరల్చడానికే అని పేర్కొన్నారు. ఇక తాలిబన్లతో చర్చల ప్రక్రియ మరింత ముందుకు సాగాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు ఇమ్రాన్ తెలిపారు.