: నరికిన ప్రతి చెట్టుకు 10 మొక్కలు నాటాలి
నాలుగు లేన్ల ప్రాజెక్టు కోసం నరికివేసిన ప్రతి చెట్టుకు బదులుగా పది మొక్కలను నాటాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఎ.ఐ)ను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ అగ్నిహోత్రి, జస్టిస్ సుధాకర్ లతో కూడిన ధర్మాసనం ఎన్.హెచ్.ఎ.ఐకు చెందిన మధురై, తిరుచిరాపల్లి, తంజావూరు, కరూర్, కారైకుడి ప్రాజెక్టు డైరెక్టర్లను ఆదేశించింది.
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం ఫిబ్రవరి 15న ప్రారంభమై ఆరునెలల్లో పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రతి నెల మొదటి పనిదినంలో ప్రాజెక్టు డైరెక్టర్లు నివేదికలను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు వెడల్పు పనుల నిమిత్తం ఇప్పటివరకు మొత్తం 67 వేలకు పైగా చెట్లను నరికివేసినట్లు ప్రాజెక్టు డైరెక్టర్లు కోర్టుకు తెలిపారు. ఈ తీర్పు ప్రకారం 6,70,640 మొక్కలను ఎన్.హెచ్.ఎ.ఐ నాటాల్సి ఉంటుందని జడ్జి తెలిపారు.