: భారత క్రీడా దుస్థితికిది పరాకాష్ట
భారత్ లో క్రీడల అభివృద్ధికి బాటలు వేస్తాం, ప్రమాణాలను శిఖరస్థాయికి తీసుకెళతాం అంటూ మాటలు కోటలు దాటించే నేతలు సిగ్గుపడాల్సిన విషయమిది. రష్యాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్న భారత క్రీడాకారులు త్రివర్ణ పతాకానికి బదులుగా ఒలింపిక్ పతాకం చేతబూని నడవాల్సి వచ్చింది. కారణమేంటంటే.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎన్నికల్లో కళంకితులను ఎంపిక చేయడంతో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాకుండా 2012 డిసెంబర్ లో ఐఓఏపై వేటు వేసింది. దీంతో, భారత క్రీడాకారులు ఐఓసీ నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనే సమయంలో త్రివర్ణ పతాకాన్ని ధరించే వీలుండదు. వారు కేవలం ఒలింపిక్ పతాకాన్ని మాత్రమే ధరించాల్సి ఉంటుంది. కాగా, వింటర్ ఒలింపిక్ క్రీడలు ఈ ఉదయం రష్యాలోని సోచిలో ఆరంభమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ క్రీడలను లాంఛనంగా ఆరంభించారు.