: భద్రగిరి సీమాంధ్రకే.. కీలక సవరణలకు జీవోఎం సమ్మతి?


చివరి అంకంలో కేంద్ర సర్కారు కాస్త మెట్టు దిగినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రజల ఆందోళనలను, విజ్ఞప్తులను ఇన్నాళ్లూ బుట్టదాఖలు చేస్తూ వస్తున్న కేంద్ర సర్కారుకి.. చివరి క్షణాల్లో జ్ఞానోదయం అయినట్లుంది. ఇన్నాళ్లూ బిల్లుకు బీజేపీ మద్దతు గ్యారంటీ అని భావిస్తూ వచ్చిన కేంద్రం.. 'సీమాంధ్రులకు న్యాయం చేస్తేనే...' అన్న బీజేపీ హెచ్చరికతో.. సీఎం కిరణ్ సహా నేతల మంత్రాంగంతో రూటు మార్చింది. గురువారం జరిగిన జీవోఎం భేటీ, ఇతర పరిణామాలే దీన్ని తెలియజేస్తున్నాయి.

భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలపాలన్న డిమాండ్ ను జీవోఎం ఆమోదించినట్లు సమాచారం. అంతేకాదు, సీమాంధ్ర రాజధానికి ఆర్థిక సాయం, వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సూచించనున్నట్లు సమాచారం. ఇక, ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ ను కూడా జీవోఎం పరిశీలించింది. అయితే, ఈ విషయంలో తెలంగాణ నేతలు, ఎంఐఎం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో దీన్ని పక్కనపెట్టవచ్చని తెలుస్తోంది. అలాగే, సీమాంధ్ర నేతలు అడుగుతున్న మిగతా డిమాండ్లను కూడా బిల్లులో చేర్చవచ్చని భావిస్తున్నారు.

గురువారం జీవోఎం సమావేశం తర్వాత అందులో సభ్యుడైన కేంద్ర మంత్రి జైరాం రమేశ్.. స్వయంగా బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు వద్దకు వెళ్లి వారు ప్రతిపాదిస్తున్న సవరణలను తెలుసుకుని వెళ్లారు. దీన్నిబట్టి చూస్తే, బీజేపీని ప్రసన్నం చేసుకుని, అటు సీమాంధ్ర నేతల డిమాండ్లను నెరవేర్చడం ద్వారా తెలంగాణ బిల్లును గట్టెక్కించాలన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వ మంత్రాంగం. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీకి ముందుకు వచ్చే విభజన బిల్లు రూపం మరికొంత స్పష్టతనివ్వనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం తెలిపేందుకే కేంద్ర కేబినెట్ భేటీ అవుతోంది. మరోవైపు పరిస్థితులను బట్టి బిల్లులో ఇతరత్ర సవరణలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News