: వచ్చేస్తోంది.. ఇన్సులిన్ రిజర్వాయర్!


మధుమేహ రోగుల ఇక్కట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైప్ 1 డయాబెటిస్ తో బాధపడేవాళ్ళు ప్రతిరోజూ ఇన్సులిన్ ను ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాల్సిందే. లేకుంటే జీవుడు మూలనపడడం ఖాయం. ఇక రోజూ ఇంజెక్షన్లు తీసుకునే బాధ లేకుండా చేసే సరికొత్త ఆవిష్కరణకు శాస్త్రవేత్తలు మెరుగులు దిద్దుతున్నారు. దానిపేరు ఇన్సులిన్ రిజర్వాయర్. ఇది రిస్ట్ వాచ్ పరిమాణంలో ఉంటుంది. దాంట్లో రెండువారాలకు సరిపడా ఇన్సులిన్ ను నింపుతారు. దీన్ని తేలికపాటి శస్త్రచికిత్స ద్వారా పొత్తికడుపు కింది భాగంలో అమర్చుతారు. దీని పనితీరు ఎలా ఉంటుందంటే..

పరికరం మూతి వద్ద జెల్ బ్యారియర్ ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే ఈ జెల్ పలుచబడి ఇన్సులిన్ బయటికి వచ్చి చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. షుగర్ లెవెల్స్ తగ్గితే ఈ జెల్ చిక్కబడి ఇన్సులిన్ ప్రసారాన్ని నిలువరిస్తుంది. ఈ పరికరం కొనను పొత్తికడుపు వద్ద బయటికి కనిపించేలా అమర్చుతారు. తద్వారా రెండు వారాలకొక మారు ఇన్సులిన్ ను నింపుతారు. అయితే, ఈ దివ్యోపకరణం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేట్టు కనిపించడంలేదు. ఎందుకంటే, 2016లో గానీ దీన్ని మనుషులపై ప్రయోగించి చూస్తారట. ఆ తర్వాతే ఇది మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News