: అమెరికా సర్జన్ జనరల్ గా కన్నడ డాక్టర్
విదేశాల్లో భారతీయులకు ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. సాఫ్ట్ వేర్ సంస్ధ మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగు తేజం సత్య నాదెళ్ల ఎంపికయిన వెంటనే అమెరికాలో అత్యున్నత పదవి సర్జన్ జనరల్ కు కర్ణాటకకు చెందిన డాక్టర్ వివేక్ హెచ్ మూర్తి(36) నియమితులవడం గర్వించదగ్గ విషయం. ఈ పదవికి వివేక్ పేరును అమెరికా దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా సిఫార్సు చేశారు. యూఎస్ చరిత్రలో సర్జన్ జనరల్ పదవిలో నియమితుడైన అత్యంత తక్కువ వయస్సు కలిగిన వ్యక్తి కావడం గమనార్హం.
ఈ పదవిలో ఉన్నవారు అమెరికా ప్రజల ఆరోగ్య సమస్యలపై ఎక్కువ దృష్టి పెడతారు. అంతేకాక, వివిధ ఆరోగ్య సమస్యలపై సలహాలు, సూచనలు ఇస్తారు. డాక్టర్ వివేక్ మూర్తి కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూరు మండలం హలెగెరె గ్రామంలో పుట్టారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి యూఎస్ సర్జన్ జనరల్ పదవికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సత్య నాదెళ్ల, డాక్టర్ మూర్తి ఇద్దరూ దక్షిణాదికి చెందిన వ్యక్తులు కావడం మరో విశేషం.