: ఆరేళ్ల పాప.. సమాజసేవకు రూ.2వేల విరాళం
నిండు వయసొచ్చినా సామాజిక బాధ్యత అంటే ఎంటో తెలియని వారికి ఒక చిన్న పాప తన చర్య ద్వారా జ్ఞాన బోధ చేసింది. ఆరేళ్లకే పంచుకోవడంలో ఉన్న పరమానందం ఏమిటో తను రుచి చూడడమే కాదు.. తోటి వారికి సాయపడాలనే సూక్ష్మాన్ని తెలియజేసింది. కర్ణాటకలోని బెల్గాంకు చెందిన ఆరేళ్ల ప్రసవపాటిల్ ఇటీవలే 2 వేల రూపాయలను సామాజిక సేవ కోసం.. మొగసెసె అవార్డు గ్రహీత డాక్టర్ ప్రకాశ్ ఆమ్టేకు అందజేసింది.
గతవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రకాశ్ బెల్గాంకు వెళ్లిన సందర్భంగా ఇది జరిగింది. ఈ విషయాన్ని ప్రకాశ్ ఆమ్టే విలేకరులకు ఈ రోజు వెల్లడించారు. 'ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక పాప నేరుగా నా వద్దకు వచ్చి డబ్బుల గురివి నా చేతిలో పెట్టింది. అందులో 2,000 రూపాయలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఇచ్చిన రూపాయి, రూపాయి గురివిలో వేసి దాచి మరీ తెచ్చించింది' అని ప్రకాశ్ తెలిపారు. కుష్టురోగుల పునరావాసం కోసం ప్రకాశ్ ఆమ్టే ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు.