: కళ్ళు తెరిచిన ధోనీ
టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఎట్టకేలకు మేలుకున్నట్టే కనిపిస్తోంది! న్యూజిలాండ్ గడ్డపై పరువు నిలుపుకోవాలంటే రెండు టెస్టుల సిరీస్ లో గెలవడం ఒక్కటే మార్గం కాగా.. నాణ్యమైన క్రికెట్ ఆడాల్సి ఉందంటూ సహచరులకు సూచనలు చేస్తున్నాడు. మ్యాచ్ లో కీలక సమయాల్లో పట్టు సాధించేందుకు ఆటగాళ్ళు శ్రమించాలని పిలుపునిచ్చాడు. కివీస్ తో వన్డే సిరీస్ లో దారుణ పరాభవాలను మూటగట్టుకున్న టీమిండియా రేపటి నుంచి టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సఫారీలతో టెస్టు సిరీస్ సందర్భంగా కనబరిచిన పోరాటపటిమను గుర్తుకుతెచ్చుకోవాలని ధోనీ జట్టుకు నూరిపోస్తున్నాడు.
ఒక్క సెషన్ లో సరైన ఆటతీరు కనబర్చకపోతే అది మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించాడు. వన్డే సిరీస్ ఓటమి తర్వాత ఐదు రోజుల క్రికెట్ కు సమాయత్తం అయ్యేందుకు తగినంత సమయం లభించిందని, దీన్ని సద్వినియోగం చేసుకున్నామని చెప్పాడు. జట్టులో పెద్దగా మార్పులుండకపోవచ్చని తెలిపాడు.