: రైల్లో పెళ్లి చేసుకున్న అండర్ వరల్డ్ డాన్


మాఫియా డాన్ అబూ సలేం (46) మరోసారి వెలుగులోకి వచ్చాడు. పన్నెండేళ్ళుగా జైల్లోనే కాలం గడుపుతున్న సలేం జనవరి 8న ఓ యువతి (27)ని రైల్లో వివాహమాడినట్టు తెలుస్తోంది. ముంబయి నుంచి ఓ కాజీ ఫోన్లో 'నిఖా' చదువుతుండగా సలేం ఆ యువతిని పరిణయమాడాడు. సలేం ఓ కేసులో ముంబయి నుంచి లక్నో కోర్టుకు వెళ్ళే క్రమంలో ఈ వివాహం సినీ ఫక్కీలో జరిగింది. ఈ పెళ్ళికి సాక్షిగా వ్యవహరించిన సలేం మేనల్లుడు రషీద్ అన్సారీని ఈ విషయమై మీడియా స్పందన కోరగా, 'అతడి వ్యక్తిగత విషయాలెందుకు? కోర్టు వ్యవహారాలపై అడగండి' అని బదులిచ్చాడు. ఇక సలేంకు ఎస్కార్ట్ గా ఉన్న పోలీసులు సైతం ఈ విషయమై వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. 'ప్రయాణంలో అతడేం చేశాడో తెలుసుకోవడం మా పని కాదు' స్పష్టం చేశారు.

అబూ సలేం ఇంతకుముందు నటి మోనికా బేడీని వివాహం చేసుకుని ఆమెతో పోర్చుగల్ చెక్కేసిన సంగతి తెలిసిందే. సలేంపై ముంబయి పేలుళ్ళ కేసుతో పాటు మ్యూజిక్ ఇండస్ట్రీ రారాజు గుల్షన్ కుమార్, నటి మనీషా కోయిరాలా సెక్రటరీ ప్రదీప్ జైన్ హత్య కేసుల్లో అభియోగాలు మోపారు. నకిలీ పాస్ పోర్టు వ్యవహారంలో కూడా సలేం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, పోర్చుగల్ లో సలేం పట్టుబడిన తర్వాత మోనికా బేడీ తమకు వివాహమే జరగలేదని చెప్పడం గమనార్హం. తాజాగా, ఈ అండర్ వరల్డ్ డాన్ వివాహమాడిన యువతి తరచూ టాడా కోర్టు వద్ద కనిపించేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News