: వరుసగా రెండోసారి జాతీయ అవార్డు సాధించిన ఎన్టీపీసీ
రామగుండంలోని జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ (ఎన్టీపీసీ) వరుసగా రెండో ఏడాది జాతీయ అవార్డు సాధించింది. విద్యుత్ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ మెరిటోరియస్ పర్ఫామెన్స్ అవార్డులను కరీంనగర్ జిల్లాలోని రామగుండం ప్రాజెక్టు అందుకుంది. 2011-12 సంవత్సరానికి గాను కాంస్య పతకం, 2012-13 సంవత్సరంలో రజత పతకాన్ని సాధించి సంస్థ పేరుప్రతిష్ఠలను మరింత పెంచింది.
న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర విద్యుత్ శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా దక్షిణ ప్రాంత కార్యనిర్వాహక సంచాలకులు వెంకటేశ్వరన్, రామగుండం కార్య నిర్వాహక సంచాలకులు శుభాశీష్ ఘోష్ లు ఈ అవార్డులను అందుకున్నారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టుకు రెండు మెరిటోరియస్ అవార్డులు రావడంతో విద్యుత్ రంగ అధికారులు, ఉద్యోగులు తమ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు.