: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నా.. బాబు అబద్ధాలకోరు: బొత్స
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తాము తెలంగాణను అడ్డుకుంటున్నామనడం సరికాదని అన్నారు. అబద్ధాలు చెప్పి లేని ఉద్యమాన్ని సృష్టించారని ఆయన మండిపడ్డారు. తమ పబ్బం గడుపుకునేందుకు తెలంగాణ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అబద్ధాలకోరని ఆయన అభిప్రాయపడ్డారు.
బీజేపీ నేతలతో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు తమను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని బొత్స ఆరోపించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు రాదని, రాష్ట్ర ఉభయసభల్లోనూ వ్యతిరేకించిన తెలంగాణ బిల్లు ఎలా ఆమోదం పొందుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నేతలు ఆక్రోశంతో తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.