: ఆమ్ ఆద్మీ.. అన్నీ వివాదాలే!
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. తొలిసారి పాలనా రుచి చూస్తున్న ఆమ్ ఆద్మీ సర్కారులో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతీ చిన్న విషయం వివాదం, రాద్దాంతం.. రచ్చరచ్చ ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు కూలిస్తే బీజేపీ నేతలు మోడీ, జైట్లీలు తనకు రూ. 20కోట్లు ఇస్తానన్నారని ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే మదన్ లాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే పార్టీకి చెందిన వినోద్ కుమార్ బిన్నీ... కేజ్రీవాల్ ఓ నియంత అని, ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఆరోపించి బహిష్కరణకు గురయ్యారు.
మంత్రి సోమనాథ్ స్వయంగా వ్యభిచార కేంద్రాలపై దాడులు చేసి విమర్శలు, వివాదాల్లో చిక్కుకున్నారు. ఇందుకు సహకరించని పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సహచర మంత్రులతో కలసి కేజ్రీవాల్ స్వయంగా ధర్నాకు దిగి రచ్చ జేశారు. సీఎం అయి ఉండి రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తారంటూ దీనిపై కోర్టులో కేసు కూడా దాఖలైంది. ఆమ్ ఆద్మీ నేత కుమార్ విశ్వాస్.. కేరళ నర్సులు నల్లగా, అసహ్యంగా ఉంటారని నోరు పారేసుకున్నారు. నలుగురూ నాలుగు చివాట్లు పెట్టినా ఆయన నోరు కట్టేసుకోలేదు. మరో సమావేశంలో .. సానియా మీర్జాకు భారత్ లో ఒక్కడూ దొరకలేదా? అంటూ హేళనగా మాట్లాడారు.
జమ్మూ కాశ్మీర్లో భద్రతాబలగాల ఉపసంహరణపై ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తమిళనాడులో ఆమ్ ఆద్మీ పుట్టి.. రోజులైనా కాలేదు.. రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఒకరిపై మరొక వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మధుబిదూరి పార్టీని వీడారు. ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే దినేష్ మోహానియాను తాగునీటి సమస్య విషయమై ఆయన నియోజకవర్గానికే చెందిన ఒక మహిళ ఆగ్రహంతో చెంప పగలగొట్టింది.