: ఆస్తిపాస్తులన్నీ ఆలయాలకే రాసిచ్చిన రాజమ్మ
ఆస్తుల కోసం ప్రాణాలను తీసేందుకు సైతం సిద్ధపడుతున్న ఈ రోజుల్లో తనకున్న ఆస్తి మొత్తాన్ని ఆలయాలకు విరాళంగా రాసిచ్చేశారు రాజమ్మ. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు వాసి అయిన బొందలపాటి రాజమ్మ.. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిని ఆలయాలకు ఇచ్చేసి, దేవుని పట్ల తనకున్న అపార భక్తిని చాటుకున్నారు. వీలునామా రాసిన అనంతరం, రాజమ్మ గత డిసెంబర్ నెలలో మరణించారు. సోమవారం నాడు ఆమె కుమారుడు సాంబశివరావు ఈ ఆస్తులకు సంబంధించిన వీలునామాను అమరావతి ఆలయ ఈవో పానకాలరావుకు అందజేశారు. వీలునామా ప్రకారం రాజమ్మ ఆస్తుల వివరాలు..
భద్రాచలంలోని రామాలయానికి 3.14 ఎకరాలు, శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానానికి 3.62 ఎకరాలను ఆమె విరాళంగా అందజేశారు. బెజవాడ కనకదుర్గమ్మకు 70 సెంట్ల సాగుభూమి, 235 చదరపు గజాల ఇంటి స్థలాన్ని రాజమ్మ దానమిచ్చేశారు. అలాగే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి 210 చదరపు గజాల ఇంటి స్థలాన్ని, అమరామతి అమర లింగేశ్వరుని ఆలయానికి 212 చదరపు గజాల్లో ఉన్న పెంకుటిల్లును, కందిమల్లాయపాలెంలోని బ్రహ్మంగారి గుడికి 93 సెంట్ల సాగుభూమిని విరాళంగా రాజమ్మ సమర్పించారు.