: కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రయోజనాలు పట్టడం లేదు..రాజకీయ డ్రామా నడిపిస్తోంది: చంద్రబాబు


కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రయోజనాలు పట్టడంలేదని, రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో డ్రామాలాడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తెలుగు జాతిలో విద్వేషాలు రెచ్చగొడుతూ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రి సహా ఇందిరాగాంధీ స్మారక చిహ్నం శక్తిస్థల్ వద్ద మౌన దీక్ష పేరిట డ్రామా ఆడుతుంటే, తెలంగాణ నేతలు నెహ్రూ స్మారక చిహ్నం వద్ద ఆందోళన చేస్తున్నారని... ఇదేం సంస్కృతి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంలో ఉన్న యూపీఏ ఆంధ్రప్రదేశ్ లోని ఇరు ప్రాంతాల నేతలు, ప్రజలు, ఉద్యమ, ఉద్యోగ సంఘాలతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు రాష్ట్రంలో ఒక్కో ప్రాంతానికి ప్రతినిధులమని చెప్తూ రాజకీయనాటకాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల తీరును ఎండగట్టడానికే తాను ఢిల్లీకి వచ్చానని బాబు తెలిపారు.

కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కనుక ఏం చేసినా చెల్లుబాటవుతుందనే గర్వంతో కాంగ్రెస్ రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ను కామన్ క్యాపిటల్ చేస్తామంటూ ఇష్టమొచ్చిన ప్రకటనలు చేస్తోందని ఆయన తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు, నేతలను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతోందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News