: తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ
తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది. తెలంగాణ బిల్లును ఎలాగైనా గట్టెక్కించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఓ వైపు పార్టీ సమావేశం అని సీమాంధ్రులను పిలిపించి సమస్యలు పరిష్కరిస్తామని చెబుతూనే, మరోవైపు కేంద్ర మంత్రులతో మీడియా సమావేశం పెట్టించి తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని ఆ పార్టీ ప్రకటించింది. సాక్షాత్తూ కేంద్ర మంత్రులే తెలంగాణ బిల్లును గట్టెక్కించే బాధ్యతను భుజాన వేసుకున్నారు.
మీడియాలో తెలంగాణకు అనుకూలమంటూ ప్రకటనలిస్తారు.. కానీ, పార్లమెంటులో తమ వైఖరి సరిగ్గా చెప్పరంటూ ప్రతిపక్ష పార్టీ బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సీమాంధ్ర నేతల మౌనదీక్షకు చెక్ పెట్టేందుకు వార్ రూం సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముసాయిదా బిల్లు పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ దశలో బిల్లులో మార్పులు-చేర్పులు అంటే జరిగేపని కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో సీమాంధ్ర నేతలు అధిష్ఠానానికి ఎదురెళ్లగలరా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.
ఏది ఏమైనా, మీడియా సమావేశంలో కేంద్ర మంత్రుల వైఖరి తెలంగాణ నేతల్లో ధైర్యం పెంచుతుండగా, వార్ రూం సమావేశంలో సీమాంధ్ర నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వార్ సమావేశం వల్ల ఇప్పడు కొత్తగా సాధించేది లేదని ఆ పార్టీ నేతలందరికీ తెలుసు. అయినా అధిష్ఠానం నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరికి ఉందనేది మిలియన్ డాలర్ ప్రశ్న.