: ఆదిలాబాద్ కలెక్టర్ అహ్మద్ బాబుకు ‘ఉపాధి’ పురస్కారం
ఆదిలాబాద్ కలెక్టర్ అహ్మద్ బాబు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ‘ఉపాధి’ పురస్కారాన్ని అందుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీనికి గాను జిల్లా కలెక్టరుకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవనంలో జరిగిన తొమ్మిదో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దివన్ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి జైరాం రమేష్ జాతీయ అవార్డును అందించారు.
ఈ పురస్కార ప్రదానం కార్యక్రమంలో దేశంలోని ఐదుగురు ఉపాధి కూలీలకు అవకాశం కల్పించగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిలాబాద్ జిల్లా వాసి పెందూర్ జంగు పాల్గొన్నారు. జిల్లాలోని నార్నూర్ మండలం గుంజాల గ్రామ వాసి పెందూర్ జంగు మాట్లాడాడు. ఉపాధి హామీ పథకంలో తాను రోజుకు 150 రూపాయలు సంపాదిస్తున్నానని, 60 వేల రూపాయలతో తన చెల్లి పెళ్లి చేశానని జంగు చెప్పాడు. సంపాదించిన సొమ్ముతో 10 మేకలను కూడా కొనుగోలు చేశానని అతడు చెప్పాడు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ వినయ్, అదనపు పీడీ గణేష్ రాథోడ్, ఏపీవో తదితరులు పాల్గొన్నారు.