: వెయ్యి మందిని బలిగొన్నందుకా... లేక 360 మంది ప్రాణాలు తీసుకున్నందుకా... ఎందుకు తల్లి?: వెంకయ్య నాయుడు
సోనియా గాంధీని కొంత మంది నేతలు తల్లి అంటున్నారని, తెలంగాణ లో వెయ్యి మంది చావుకు కారణమైందనా? లేక సీమాంధ్రలో 360 మందిని బలిగొన్నందుకా? అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. కొంపల్లిలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడంలో చిత్తశుద్ధి ఉందని చెబుతున్న దిగ్విజయ్ సింగ్, అసెంబ్లీలో బిల్లును ఓడించాలని చెప్పింది అధిష్ఠానమేనని అన్నారని మండిపడ్డారు. ఇదేం సంస్కృతి? అని ఆయన మండిపడ్డారు. వారే రాష్ట్రం ఇస్తామంటారు, వారే అగ్గి రాజేస్తారు. ఎంత కుట్ర? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రాంతాల్లో మరిన్ని విద్వేషాలు రగిల్చే కుట్ర జరుగుతోందని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని ఆయన సూచించారు. బీజేపీ ఫ్యామిలీ పార్టీ కాదని, వ్యక్తి పూజ ఇక్కడ ఉండదని వెంకయ్య స్పష్టం చేశారు. తాము తీసుకునే ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనాల కోసం తీసుకుంటామని ఆయన తెలిపారు.