: కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను వివరిస్తాం: చంద్రబాబు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన బాబు, ఆరు నెలల నుంచి టీడీపీ విభజనపై స్పష్టతతో ఉందన్నారు. రాష్ట్రపతిని, జాతీయ నేతలను కలసి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చేస్తున్న కుట్ర రాజకీయాలను వివరిస్తామన్నారు. రాష్ట్ర విభజన చేసే విధానం ఇది కాదని ఎప్పట్నుంచో చెబుతున్నామన్నారు. అందరితో చర్చించి ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలతో కుమ్మక్కై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. విభజన ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, తెలుగు జాతిని విచ్ఛిన్నం, నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అసలు లోపాలతో కూడిన బిల్లును రాష్ట్ర శాసనసభకు పంపారని, రెండు ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా లేదని బాబు ఉద్ఘాటించారు. దేశంలో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నా కేంద్రం ముందుకు వెళుతోందన్నారు. అయితే, తెలంగాణ, సీమాంధ్రులకు తప్పకుండా న్యాయం చేయాలని రాజ్ నాథ్ ను కోరినట్లు బాబు తెలిపారు.